మత్స్యకారుల ఆందోళన ఉధృతం
వృత్తికి విఘాతం కలిగిస్తే మూల్యం తప్పదు : నిర్వాసితుల హెచ్చరిక
ప్రజాశక్తి-ఎస్.రాయవరం
మండలంలోని బంగారమ్మపాలెం మత్స్యకారుల ఆందోళన ఉధృతం చేశారు. నేవల్ బేస్ నిర్మాణ కేంద్రం వద్ద చేపట్టిన ధర్నా బుధవారం మూడోరోజుకు చేరింది. టెంట్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. మత్స్యకార మహిళలకు గంపల ప్యాకేజీ, 18 ఏళ్లు నిండిన మగ, ఆడ పిల్లలుకు ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నేవల్ బేస్ నిర్మాణ ప్రాంతంలో మత్స్యకారులకు ఉపాధి కల్పించాలని, అర్హులైనవారికి కాంట్రాక్టు పనులు ఇప్పించాలని డిమాండ్ చేశారు. నిర్మాణాలు ప్రారంభానికి ముందు అధికారులు ఇచ్చిన హామీలు గాలిలో కలిసిపోయాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణ ప్రాంతంలో తమకు ఉపాధి కల్పిస్తామని హామీలు గుప్పించిన నాయకులు, అధికారులు నేడు నోరు మెదపడం లేదన్నారు. గ్రామాన్ని ఇంకొకచోటికి తరలించే ప్రయత్నం చేస్తే ముందుగా వసతులు అన్ని సమకూర్చిన తరువాతే గ్రామాన్ని ఖాళీ చేస్తామని స్పష్టం చేశారు. మత్స్యకారుల వత్తికి విఘాతం కలిగే చర్యలు ఎవరు చేసినా మూల్యం చెల్లించక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు, మత్స్యకారులు పాల్గొన్నారు.

