sreenuraaz sreenuraaz Author
Title: నినదించిన నిర్వాసితుల గళం
Author: sreenuraaz
Rating 5 of 5 Des:
రాంబిల్లి నుంచి ఎలమంచిలికి మహాపాదయాత్ర  కదం కలిపి కదిలిన ఆరు గ్రామాల ప్రజలు  ఎలమంచిలిలో వేలాదిమందితో రాస్తారోకో  స్పందించకుంటే ఎన్‌ఏఓబీ గే...

రాంబిల్లి నుంచి ఎలమంచిలికి మహాపాదయాత్ర 
కదం కలిపి కదిలిన ఆరు గ్రామాల ప్రజలు 
ఎలమంచిలిలో వేలాదిమందితో రాస్తారోకో 
స్పందించకుంటే ఎన్‌ఏఓబీ గేటుకు తాళాలే 
కలెక్టర్‌ దృష్టికి తీసుకెళతామన్న అధికారులు 
రాంబిల్లి, ఎలమంచిలి, న్యూస్‌టుడే: రాంబిల్లి, ఎస్‌.రాయవరం మండలాల్లోని సుమారు 4500 ఎకరాల్లో నిర్మిస్తున్న ప్రత్యామ్నాయ నావికాస్థావరం (ఎన్‌ఏఓబీ) ప్రాజెక్టులో ఉపాధి కోల్పోయామంటూ రెండు వారాలకు పైగా ధర్నా కొనసాగిస్తున్న ఆరు గ్రామాల నిర్వాసితులు సోమవారం కదం తొక్కారు. రాంబిల్లి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలమంచిలి వరకు వేలాదిమందితో మహా పాదయాత్ర నిర్వహించారు. రాంబిల్లి మండలంలోని కొత్తపట్నం, వాడనర్సాపురం మత్స్యకారులు, నేవీకాలనీ నిర్వాసితులు, కొత్తపేట, యాతకొత్తపట్నం, చినకలవలాపల్లి గ్రామాల వాసులు రెండువారాలుగా ఎన్‌ఏఓబీ ఎదుట ఆందోళనలు చేస్తున్నారు. పనులు మానుకుని శిబిరాలు ఏర్పాటు చేసుకుని వంటావార్పు చేస్తూ తమ నిరసన కొనసాగించారు. కానీ తమ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో నిర్వాసితులు, మత్స్యకారుల్లో ఆగ్రహం పెల్లుబికింది. దీంతో సోమవారం మహా పాదయాత్ర తలపెట్టారు. ఉదయం 11 గంటలకు ఎన్‌ఏఓబీ గేటు ఎదుట యాత్ర ప్రారంభించారు. వృద్ధులు, యువతీ యువకులు, మహిళలు, పెద్దలు సమష్టిగా డిమాండ్ల సాధనకు కదిలారు. వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారు మార్గమధ్యంలో వాహనాల్లో ఎక్కి ఎలమంచిలి వెళ్లారు. మధ్యాహ్నం 2 గంటలకు ఎలమంచిలి పట్టణంలోని ఎన్‌ఏవోబీ భూసేకరణ కార్యాలయానికి పాదయాత్ర చేరుకుంది. పెండింగ్‌లో ఉన్న డిమాండ్లు పరిష్కరించాలంటూ ఎన్‌ఏఓబీ ప్రత్యేక భూసేకరణ విభాగం కార్యాలయం సాయంత్రం ఆరుగంటల వరకు రహదారిపై బైఠాయించారు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ నినాదాలతో నినాదాలతో హోరెత్తించారు.
ఒప్పందాలు అమలు చేయాలి 
ముందుగా ప్రకటించిన ఒప్పందం ప్రకారం నిర్వాసితులకు ప్యాకేజీ ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యులు సీహెచ్‌.నర్సింగరావు డిమాండ్‌ చేశారు. ఆందోళనకారులకు సంఘీభావం ప్రకటించి రాస్తారోకోలో పాల్గొన్న ఆయన వారిని ఉద్దేశించి మాట్లాడారు. మత్స్యకారులు అత్యంత శక్తిమంతులన్న విషయం ప్రభుత్వం మరచిపోకూడదన్నారు. కొత్తపేట, చినకలవలాపల్లి గ్రామాలను ప్రాజెక్టు ప్రభావిత గ్రామాలుగా ప్రకటించాలని కోరారు. నేవీ పైపులైన్‌ వల్ల నష్టపోతున్నవారికి పరిహారం ఇవ్వాలన్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో 90 శాతం నిర్వాసితులకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కేంద్రీయ విద్యాలయం, వైద్యశాలలు నిర్మిచాలని కోరారు. సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి లోకనాథం మాట్లాడుతూ నిర్వాసితులందరికీ ఆర్‌ కార్డులు ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. 50 ఏళ్లు దాటినవారికి నెలకు రూ. 3 వేలు పింఛను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇళ్లస్థలాలు, పరికరాలు సత్వరం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వైకాపా సమన్వయకర్త ఉప్పలపాటి రమణమూర్తిరాజు మాట్లాడుతూ ఎన్‌ఏవోబీ ఎలమంచిలి నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం ఒక శాపం అన్నారు. ఈ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నందున సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయులు ప్రగడ నాగేశ్వరరావు, బొడ్డేటి ప్రసాద్‌, బోదెపు గోవింద్‌, కస్పా రవికుమార్‌, మాజీ సర్పంచులు చోడిపల్లి సత్యనారాయణ, చింతకాయల ఎర్రయ్య, మాడెం రాజుబాబు, చెల్లూరి నూకన్న పాల్గొన్నారు.
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం 
ఎలమంచిలి, న్యూస్‌టుడే: ఎన్‌ఏబీ నిర్వాసితుల డిమాండ్లను కలెక్టర్‌, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని భూసేకరణ విభాగం ఉప కలెక్టర్‌ భాస్కరరెడ్డి, అనకాపల్లి రెవెన్యూ డివిజన్‌ అధికారి సూర్యకళ హామీ ఇచ్చారు. సీపీఎం నాయకులు నర్సింగరావు, లోకనాథం, నిర్వాసితుల సంఘం నాయకులతో వీరు సమావేశమై మాట్లాడారు. నిర్వాసితులు తమ డిమాండ్లను వివరిస్తూ ఒక వినతిపత్రం అందించారు. వీటిని పరిశీలించిన ఉప కలెక్టర్‌, ఆర్‌డీఓ వారికి నచ్చజెప్పారు. ఇది తమ పరిధిలోని అంశాలు కాదని, కలెక్టర్‌ దృష్టిలో పెట్టి ఆయన ద్వారా ప్రభుత్వానికి, నేవల్‌ బేస్‌ అధికారులకు విషయాన్ని వివరిస్తామన్నారు. పరిహారం అందాల్సిన వారందరికీ చెక్కులు సిద్ధం చేశామన్నారు. చదువుకున్న వారికి ఉపాధి అవకాశాలు కల్పించమని నేవీ అధికారులను కోరతామని చెప్పారు. నిర్వాసితులందరికీ న్యాయం జరిగేలా చేస్తామని వీరు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు పాపారావు, వివేకానంద, రమణ, సీఐ. విజయ్‌నాథ్‌ తదితరులు పాల్గొన్నారు.
భారీ బందోబస్తు 
రాస్తారోకో సందర్భంగా నర్సీపట్నం అదనపు ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, అనకాపల్లి డీఎస్పీల ఆధ్వర్యంలో వందమంది పోలీసులతో భారీగా బందోబస్తు నిర్వహించారు. మత్స్యకారులు తిరిగి వారి గ్రామాలకు చేరుకోవడానికి పెద్ద సంఖ్యలో వాహనాలు తెచ్చుకోవడంతో పాత జాతీయ రహదారి అంతా వాహనాలతో నిండిపోయింది. వాహనాలను పెదపల్లి రైల్వేగేటు మీదుగా, ఇక్కడి నుంచి వెళ్లే వాహనాలను రేగుపాలెం మీదుగా పంపారు.

Advertisement

 
Top