
స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ధర్నా ఆపం
ఎమ్మెల్యేకు తేల్చిచెప్పిన నిర్వాసితులు
ఉన్నతాధికారులకు తెలియపరుస్తా : అనిత
ప్రజాశక్తి-ఎస్.రాయవరం
న్యాయమైన సమస్యలు పరిష్కరించేవరకు ధర్నా విరమించేది లేదని బంగారమ్మపాలెం మత్స్యకారులు ఎమ్మెల్యే అనితకు తెగేసి చెప్పారు. శనివారం ఉదయం బంగారమ్మపాలెం వెళ్లిన ఎమ్మెల్యే బందం మత్స్యకారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేవల్ బేస్ నిర్మాణం వల్ల మత్స్యకారుల ఉపాధి దెబ్బ తినకుండా ప్రత్యేక ప్యాకేజీ అమలు జరిగిందన్నారు. స్థానికులకు ఉపాధి కల్పిస్తామన్న హామీ గాలిలో కలసిపోయిందని మత్స్యకారులు ధ్వజమెత్తారు. 'మీ న్యాయమైన సమస్యల పరిష్కారానికి సమయం పడుతుందని అందువల్ల మీ కుటుంబాలు ఉపాధి మాని ధర్నాలో కూర్చోవడం మూలంగా ఇబ్బందులు పడతారన్నారు' అని ఎమ్మెల్యే అనిత చెప్పారు. దీనికి ప్రతిగా మత్స్యకారులు నేవల్ బేస్ నిర్మాణం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇలాగే చెపుతున్నారని, స్పష్టమైన హామీ ఇచ్చే వరకూ ఆందోళన విరమించేదిలేదని చెప్పిడంతో ఆమె ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఈమె వెంట ఎంపిపి వినోద్ రాజు, నాయకులు నల్లపరాజు గుర్నాధరావు ఉన్నారు.